Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 8వ అధ్యాయము

1  కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. 
2  క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. 
3-4. శరీరముననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్రసంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప (పరిహారము ) నిమిత్తము దేవుడు తన స్వకీయకుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఏలయనగా శరీరస్వభావమును బట్టి ధర్మశాస్త్రము బలహీనమాయెను గనుక అది దానికి అసాధ్యమాయెను. 
5  శరీరానుసారులు శరీరవిషయములను మనస్కరింతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. 
6  శరీరానుసారమైన మనస్సు మరణము; ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. 
7  ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది;అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. 
8  కాగా శరీరస్వభావముగల వారు దేవుని సంతోషపరచనేరరు. 
9  దేవుని ఆత్మ మీలో నివసించియున్న పక్షమున మీరు ఆత్మస్వభావముగలవారే గాని శరీరస్వభావముగలవారు కారు. 1ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు. 
10  క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతివిషయమై జీవయుక్తమైనది. 
11  మృతులలోనుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించినయెడల, మృతులలోనుండి క్రీస్తుయేసును లేపినవాడు చావుకు లోనైన మీ శరీరములను కూడ మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. 
12  కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్ధులము కాము. 
13  మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసినవారై యుందురు గాని ఆత్మచేత శారీరక్రియలను చంపినయెడల జీవించెదరు. 
14  దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులై యుందురు. 
15  ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని స్వీకృతపుత్రాత్మను2పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము నాయనా తండ్రీ అని మొర్రపెట్టుచున్నాము. 
16  మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. 
17  మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోటి వారసులము. 
18  మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమ యెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను. 
19  దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 
20-21. ఏలయనగా సృష్టి క్షయాధీనదాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా మాయకు లోపరచబడెను. 
22  సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదము. 
23  అంతేకాదు, ఆత్మయొక్క ప్రధమ ఫలముల నొందిన మనముకూడ స్వీకృతపుత్రత్వము కొరకు, అనగా మన దేహముయొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 
24  ఏలయనగా మనము నిరీక్షణ కలిగినవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని  యుండదు; తాను చూచుచున్నదానికొరకు ఎవడు నిరీక్షించును? 
25  మనము చూడనిదానికొరకు నిరీక్షించినయెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము. 
26  అటువలె ఆత్మయు మన దౌర్బల్యమును చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. 
27  మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మయెక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 
28  దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని3యెరుగుదుము. 
29  ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. 
30  మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 
31  ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షమున నుండగా మనకు విరోధియెవడు? 
32  తన స్వకీయకుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? 
33  దేవుని చేత ఏర్పరచబడినవారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; 
34  శిక్ష విధించువాడెవడు? చనిపోయినవాడు క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడు ఆయనే; ఆయన దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై, మన కొరకు విజ్ఞాపనముకూడ చేయుచున్నాడు. 
35  క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 
36  ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినదేమనగా -మేము నీ నిమిత్తము దినమెల్ల చంపబడుచున్నాము; వధకైన గొర్రెలగా ఎంచబడుచున్నాము. 
37  అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. 
38  మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను 39  ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసుద్వారా కనపరచబడియున్న దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. 
Download Audio File

No comments:

Post a Comment