Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 2వ అధ్యాయము

1  కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్ధుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? 
2  అట్టి కార్యములు చేయు వారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 
3  అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? 
4  లేదా, దేవుని అనుగ్రహము మారుమవస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 
5  నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 
6  ఆయన ప్రతినానికి వాని వాని క్రియలచొప్పున ప్రతిఫలమిచ్చును. 
7  సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవము నిచ్చును. 
8-9. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్ణీతికి లోబడువారిమీదకి ఆయన ఉగ్రతను రౌద్రమును (కలుగును. ) దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. 
10  సత్ క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. 
11  దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; 
12  ధర్మశాస్త్రము కలిగినవారై పాపముచేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. 
13  ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 
14  ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన పక్షమున, వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకుతామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 
15  అట్టివారి మనస్సాక్షికూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రాసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. 
16  దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు (ఈలాగు జరుగును. ) 
17  నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 
18  ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైనవాటిని మెచ్చుకొనుచున్నవు కావా? 
19  జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 
20  చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్దిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 
21  ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 
22  వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? 
23  ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమాన పరచెదవా? 
24  వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది? 
25  నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 
26  కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనిన పక్షమున అతడు సున్నతి లేనివాడునైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? 
27  మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 
28  బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. 
29  అయితే అంతరంగమందు యూదుడైనవాడే యూదుడు. మరియు సున్నతి హృదయసంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును. 
Download Audio File

No comments:

Post a Comment