Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Friday, July 26, 2013

రోమా 1వ అధ్యాయము

1  యేసు క్రీస్తు దాసుడును అపోస్తులుడుగా 
2-7. నుండుటకు పిలువబడినవాడును, దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికి, అనగా పరిశుద్దులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి ) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసుక్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తు విషయమైన ఆ సువాసనను పరిశుద్ద లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసు క్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్ధానుడైనందున పరిశుద్దమైన ఆత్మనుబట్టి ప్రభావముచేత దేవుని కుమారుడుగాను నిరూపింపబడిన వాడాయెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తువారుగా ఉండుటకు పిలువబడియున్నారు. 
8  మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞాతాస్తుతులు చెల్లించుచున్నాను. 
9-10. ఇప్పుడేలాగైనను ఆటంకము లేకుండా మీయొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని, నా ప్రార్ధనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్తవిషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. 
11  స్ధిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని 
12  ఆత్మసంబంధమైన కృపావరమేదైననూ మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల ఆపేక్షించుచున్నాను. 
13  సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడా ఫలమేదైనను పొందవలెనని అనేకపర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు. 
14  హెల్లేనీయులకును హెల్లేనీయులుకానివారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్ధుడను. 
15  కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. 
16  సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ రక్షణ యున్నది. 
17  ఎందుకనిన --నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడియున్నప్రకారము2విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది. 
18  దుర్ణీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను దుర్ణీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. 
19  ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. 
20  ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. 
21  మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్ధులైరి. 
22  వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 
23  వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపమగా మార్చిరి. 
24  ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. 
25  అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల పర్యంతము ఆయన స్తోత్రార్హుడైయున్నాడు, ఆమేన్. 
26  అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్దమైన ధర్మమును అనుసరించిరి. 
27  అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి. 
28  మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను. 
29  అట్టివారు సమస్తమైన దుర్ణేతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము, వైరమను వాటితో నిండినవారై. 
30  కొండెగాండ్లును అపవాదకులును దేవ ద్వేషులును హింసకులును అహంకారులును బింకములాడువారును చెడ్డవాటిని కల్పించువారును తలిదండ్రుల కవిధేయులును అవివేకులును. 
31  మాట తప్పువారును అనురాగరహితులును నిర్దయులునైరి. 
32  ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. 
Download Audio File

రోమా 2వ అధ్యాయము

1  కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్ధుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? 
2  అట్టి కార్యములు చేయు వారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము. 
3  అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? 
4  లేదా, దేవుని అనుగ్రహము మారుమవస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? 
5  నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. 
6  ఆయన ప్రతినానికి వాని వాని క్రియలచొప్పున ప్రతిఫలమిచ్చును. 
7  సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవము నిచ్చును. 
8-9. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్ణీతికి లోబడువారిమీదకి ఆయన ఉగ్రతను రౌద్రమును (కలుగును. ) దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, శ్రమయు వేదనయు కలుగును. 
10  సత్ క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి హెల్లేనీయునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. 
11  దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; 
12  ధర్మశాస్త్రము కలిగినవారై పాపముచేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. 
13  ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 
14  ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసిన పక్షమున, వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకుతామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 
15  అట్టివారి మనస్సాక్షికూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రాసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. 
16  దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు (ఈలాగు జరుగును. ) 
17  నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా? 
18  ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైనవాటిని మెచ్చుకొనుచున్నవు కావా? 
19  జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను, 
20  చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్దిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనైయున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? 
21  ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా? 
22  వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్ళను దోచెదవా? 
23  ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమాన పరచెదవా? 
24  వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది? 
25  నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 
26  కాబట్టి సున్నతి లేని వాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనిన పక్షమున అతడు సున్నతి లేనివాడునైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా? 
27  మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్నతియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా? 
28  బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. 
29  అయితే అంతరంగమందు యూదుడైనవాడే యూదుడు. మరియు సున్నతి హృదయసంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును. 
Download Audio File

రోమా 3వ అధ్యాయము

1  అట్లయితే యూదునికి కలిగిన ఆధిక్యమేమి? సున్నతివలన ప్రయోజనమేమి? 
2  ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. 
3  కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా?1అట్లనరాదు. 
4  నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లునుఅని వ్రాయబడిన ప్రకారము2 ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడుకాక తీరడు. 
5  మన దుర్ణీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినయెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్ధుడగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; 
6  అట్లనరాదు. అట్లయినపక్షమున దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? 
7  దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలించినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల? 
8  మేలు కలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే. 
9  అలాగైన ఏమందుము? మేము వారికంటే శ్రేష్టులమా? ఎంతమాత్రము కాము. యూదులేమి హెల్లేనీయులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము. 
10  ఇందుకు (ప్రమాణముగా ) వ్రాయబడినదేమనగా. 
11  నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకు వాడెవడును లేడు. 
12  అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. 
13  వారి గొంతుక తెరచిన సమాధి; తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవులక్రింద సర్పవిషమున్నది4. 
14  వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి5. 
15  రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. 
16  నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి. 
17  శాంతిమార్గము వారెరుగరు6. 
18  వారి దృష్టియెదుట దేవుని భయములేదు7. 
19  ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవునియెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్నవాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము. 
20  ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. 
21  ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. 
22  అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. 
23  ఏ బేధమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 
24  కాబట్టి (నమ్మువారు ) ఆయన కృప చేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా, నిర్హేతుకముగా8నీతిమంతులని తీర్చబడుచున్నారు. 
25  పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనుపరచవలెనని. 
26  క్రీస్తుయేసురక్తమునందలి విశ్వాసముద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనుపరచునిమిత్తము, తాను నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను. 
27  కాబట్టి అతిశయాస్పదమెక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాసన్యాయమును బట్టియే. 
28  కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. 
29  దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అవును అన్యజనులకును దేవుడే. 
30  దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును. 
31  విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్ధిరపరచుచున్నాము. 
Download Audio File

రోమా 4వ అధ్యాయము

1  కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము? 
2  అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయాస్పదము కలుగును గాని అది దేవునియెదుట కలుగదు. 
3  లేఖనమేమి చెప్పుచున్నది అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 1 
4  పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని యెంచబడదు. 
5  పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 
6  ఆ ప్రకారమే క్రియలు లేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడా చెప్పుచున్నాడు. 
7  ఏలాగనగా ఎవరి అతిక్రమములు క్షమించబడెనో ఎవరి పాపములు కప్పివేయబడెనో వారు ధన్యులు. 
8  ప్రభువు ఏ మనుష్యునిగూర్చి పాపమును ఎంచడో వాడు ధన్యుడు. 2
9  ఈ శుభవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పినదా సున్నతిలేనివారినిగూర్చి చెప్పినదా? అబ్రాహాముయొక్క విశ్వాసమతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా? 
10  మంచిది; అది ఏ స్ధితియందు ఎంచబడెను? సున్నతి కలిగియుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే. 
11  మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రియగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలనైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. 
12  మరియు సున్నతిగలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనినవారికి తండ్రి అగుటకు, (అతడు ఆ గురుతు పొందెను ) 
13  అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రాహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదు గాని విశ్వాసమువలననైన నీతిమూలముగానే కలిగెను. 
14  ధర్మశాస్త్రసంబంధులు వారసులైనపక్షమున విశ్వాసము వ్యర్ధమగును, వాగ్దానమును నిరర్ధకమగును. 
15  ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేనిపక్షమున అతిక్రమమును లేకపోవును. 
16  ఈ హేతువుచేతను ఆ వాగ్దానము యావత్సంతతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రము కాక అబ్రాహాముకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృప ననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను. 
17  తాను విశ్వసించిన దేవునియెదుట, అనగా మృతులను సజీవులునుగా చేయువాడునైన దేవునియెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని3అని అందుకు (ప్రమాణముగా ) వ్రాయబడియున్నది. 
18  నీ సంతానము ఈలాగు ఉండునని4చెప్పినదానిబట్టి తాననేక జనములకు తండ్రియగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 
19  మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,. 
20  అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక 
21  దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్దుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను. 
22  అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 
23  అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు, 
24  మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయబడెను. 
25  ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. 
Download Audio File

రోమా 5వ అధ్యాయము

1  కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుందము1. 
2  మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమనుగూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము. 
3-4. అంతేకాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. 
5  మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. 
6  ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను. 
7  నీతిమంతునికొరతు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. 
8  అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనమింక పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. 
9  కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయనద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 
10  ఏలయనగా శత్రువులమైయుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన పక్షమున, సమాధాన పరచబడినవారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. 
11  అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్ధితి పొందియున్నాము. 
12  ఇట్లుండగా ఒక మనుష్యునిద్వారా పాపమును, పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను2. 
13  ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినదనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 
14  అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపముచేయని వారిమీదకూడా, ఆదాము మొదలుకొని మోషే పర్యంతము మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను. 
15  అయితే అపరాధము కలిగినట్టు కృపావరమును కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయిన పక్షమున, మరి నిశ్చయముగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు కలుగునట్లు అవి విస్తరించెను. 
16  మరియు పాపముచేసిన యొకనివలన (శిక్షావిధి ) కలుగునట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై (మనుష్యులు ) నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 
17  మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకనిద్వారానే యేలినపక్షమున, కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకనిద్వారానే యేలుదురు. 
18  కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, అలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. 
19  ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. 
20  మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. 
21  అయినను పాపము మరణమును ఆధారముచేసికొని యేలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతిద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలునిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. 
Download Audio File

రోమా 6వ అధ్యాయము

1  అలాగైన యేమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? 
2  అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? 
3  క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? 
4  కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో (పాలుపొందుటకై ) ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. 
5  మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తులమైన యెడల, ఆయన పునరుత్ధానముయొక్క సాదృశ్యమందును ఆయనతో సంయుక్తులమై యుందుము. 
6  ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్ధకమగునట్లు, మన ప్రాచీనస్వభావము3ఆయనతోకూడ సిలువవేయబడెనని యెరుగుదుము. 
7  చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొంది యున్నాడు. 
8-9. మనము క్రీస్తుతోకూడ చనిపోయినయెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము. 
10  ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవంచుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు. 
11  అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు జీవితులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. 
12  కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి. 
13  మరియు మీ అవయవములను దుర్ణీతి సాధనములుగా1పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోనుండి జీవితులమనుకొని, మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 
14  మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. 
15  అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి కూడదు. 
16  లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులగా అప్పగించుకొందురో, అది మరణార్ధముగా పాపమునకే గాని, నీత్యర్ధముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? 
17  మీరు పాపమునకు దాసులై యుంటిరి గాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వముగా లోబడిన వారై. 
18  పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. 
19  మీ శరీర బలహీనతనుబట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను; ఏమనగా అక్రమము చేయుటకై, అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, ఆలాగే పరిశుద్ధత కలుగుటకై యిప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 
20  మీరు పాపమునకు దాసులై యున్నప్పుడు నీతివిషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. 
21  అప్పటి క్రియలవలన మీకేమి ఫలము కలిగెను; వాటినిగురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? 
22  అయినను ఇప్పుడు పాపమునుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము; దాని అంతము నిత్యజీవము. 
23  ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. 
Download Audio File

రోమా 7వ అధ్యాయము

1  సహోదరులారా, మనుష్యుడు బ్రదికినంత కాలమే ధర్మశాస్త్రమతనిమీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. 
2  భర్తగల స్త్రీ భర్త బ్రదికియున్నంతవరకే ధర్మశాస్త్రమువలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయినయెడల భర్త విషయమైన ధర్మశాస్త్రమునుండి ఆమె విడుదలపొందును. 
3  కాబట్టి భర్త బ్రదికియుండగా ఆమె వేరొక పురుషుని చేరినయెడల వ్యభచారిణియనబడును గాని, ఆమె భర్త చనిపోయిన యెడల ధర్మశాస్త్రమునుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని చేరినను వ్యభచారిణి కాకపోవును. 
4  కావున నా సహోదరులారా, మనము దేవునికొరకు ఫలమును ఫలించునట్లు మృతులలోనుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరముద్వరా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. 
5  ఏలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్ధమైన ఫలమును ఫలించుటకై, ధర్మశాస్త్రమువలననైన పాపేచ్ఛలు మన అవయలములలో కార్యసాధకములైయుండెను. 
6  ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదలపొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్ధితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్ధితి గలవారమై సేవచేయుచున్నాము. 
7  కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్లనరాదు. ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని చెప్పనియెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. 
8  అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. 
9  ఒకప్పుడు నేను ధర్మశాస్త్రములేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. 
10  అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞ నాకు మరణార్ధమైనట్టు కనబడెను. 
11  ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. 
12  కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞకూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది. 
13  ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైనదాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడునిమిత్తము, అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము, (అది నాకు మరణకరమాయెను. ) 
14  ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను. 
15  ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను (చేయ ) నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 
16  ఇచ్ఛయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. 
17  కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాను. 
18  నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను ఇచ్ఛ నాకు తటస్థమై యున్నది గాని, దాని చేయుట నాకు తటస్థముకాదు. 
19  నేను చేయ నిచ్ఛయించు మేలుచేయక యిచ్ఛయింపని కీడు చేయుచున్నాను. 
20  నేను ఇచ్ఛయింపనిదానిని చేసినయెడల, అది చేయునది నాయందు నివసించు పాపమేగాని యికను నేను కాను. 
21  కాబట్టి మేలుచేయ నిచ్ఛయించు నాకు కీడు తటస్థమైయున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. 
22  అంతరంగపురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని. 
23  వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోపరచుకొనుచున్నది. 
24  అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను; ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? 
25  మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సువిషయములో నేను దైవనియమమునకును, శరీరవిషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను. 
Download Audio File